BREAKING
ADD

Saturday 4 June 2016

శ్రీ శ్రీ సినిమా రివ్యు | Sri Sri movie review



‘శ్రీ శ్రీ’ సినిమా రివ్యు

26Pictures Rating: 3.5/5

‘సూపర్‌స్టార్’ కృష్ణ.. తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఇలా చేపట్టిన అన్ని బాధ్యతలనూ సమర్ధవంతంగా నిర్వహించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ వారసత్వం ఈతరం సూపర్ స్టార్‌గా అవతరించిన మహేష్ ద్వారా కొనసాగుతూనే ఉంది. కొద్దికాలంగా నటనకు దూరంగా ఉంటూ వచ్చిన కృష్ణ, మళ్ళీ ఇన్నాళ్ళకు తన అభిమానులను అలరించేందుకు ‘శ్రీ శ్రీ’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘సంక్రాంతి’, ‘రాజా’ లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ముప్పలనేని శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ ఎప్పటికీ పాతది కాదు అన్న ట్యాగ్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం…

కథ :

శ్రీ శ్రీ (కృష్ణ) తన భార్య(విజయ నిర్మల) కూతురు శ్వేతలతో సంతోషకరమైన జీవితం గడిపే ఓ ప్రొఫెసర్. ఓ ప్రముఖ న్యూస్ చానల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసే శ్వేతకు భిక్షపతి (పోసాని కృష్ణమురళి), జేకే (మురళి శర్మ) అనే ఇద్దరు క్రిమినల్స్ చేసే ఓ భారీ స్కామ్ గురించి తెలుస్తుంది. ఈ విషయం గురించే పోలీసులకు తెలియజేయాలనుకుంటుండగా భిక్షపతి, జేకే మనుషులు శ్వేతను హతమరుస్తారు.

దీంతో కూతురు చావుకి కారణమైన వారిని శిక్షించాలంటూ శ్రీ శ్రీ చేసే న్యాయ పోరాటం వృథా అవుతుంది. నిస్సహాయ స్థితిలో తానే వారిని శిక్షించాలనుకున్న శ్రీ శ్రీ వారిని ఏం చేశాడూ? వారిపై ఎలా పగ తీర్చుకున్నాడూ? అన్నది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సూపర్ స్టార్ కృష్ణ రోల్ ఈ సినిమాకు అన్నింటికీ మించి మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఆ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయి కనిపించారు. తన స్థాయికి తగ్గ నటనతో ఆయన హుందాగా నటించారు. ఇక ఈ వయసులోనూ ఒక ప్రధాన పాత్రలో నటించడంలో ఆయన చూపిన ఉత్సాహానికి అభినందించాల్సిందే! ముఖ్యంగా ఓ నిస్సహాయ ప్రొఫెసర్ పగ తీర్చుకోవడం ఎలా ఉంటుందో అన్న నేపథ్యం నుంచి పుట్టే సన్నివేశాలు బాగున్నాయి. ఇక కృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకొని అనవసర ఆర్భాటాలు చేయకుండా, పగ తీర్చుకోవడం కూడా ఎక్కడా ఓవర్ చేయకుండా ఉండడాన్ని ప్లస్ పాయింట్‌గానే చెప్పుకోవాలి.

నరేష్ ఓ మర్డర్ మిస్టరీని చేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఇక విజయ నిర్మల కూడా తన పాత్రకు న్యాయం చేశారు. కృష్ణ కూతురుగా నటించిన నటి చాలా బాగా చేసింది. మురళీ శర్మ, పోసాని తదితరులు తమ పాత్ర పరిధిమేర బాగానే నటించారు. ఇక సినిమా పరంగా ఫస్టాఫ్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌తో బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఓ ఆకట్టుకునే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ దాదాపుగా నెమ్మదిగా, పెద్దగా కట్టిపడేసే సన్నివేశాలేమీ లేకుండా సాగుతుండడాన్నే మేజర్ మైనస్‌గా చెప్పుకోవాలి. ఈ పార్ట్‌లో ఫ్లాష్‌బ్యాక్ నేపథ్యాన్ని రెండు మూడు సార్లు చూపించడం కూడా బాగోలేదు. అదేవిధంగా ఇలాంటి కథల్ని ఇప్పటికే మనం చాలా చూసి ఉండడంతో కథ పరంగా కొత్తదనం ఆశించడానికి ఏమీ లేదు. ఇక కథనంలోనూ చివరికి ఏమైపోతుందో కూడా ముందే తెలిసిపోవడం ఈ సినిమా విషయంలో మరో మైనస్‌గా చెప్పుకోవాలి.

సెకండాఫ్‌లో నరేష్ క్యారెక్టర్‌ని కూడా సరిగ్గా డిజైన్ చేసినట్లు కనిపించదు. కొన్నిచోట్ల తక్కువ డీటైలింగ్ ఇవ్వడంతో కథలో క్లారిటీ లోపించినట్లు కనిపించింది. లాజిక్‌ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కొన్ని కొన్ని చోట్ల ఈ సినిమా పాతతరం సినిమాల్ని చూస్తున్న ఫీలింగ్ కల్పించి బోర్ కొట్టిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా ఈ సినిమాను ఎక్కడా క్వాలిటీ పరంగా రాజీ పడకుండా, మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించిన విధానాన్ని మెచ్చుకోవాలి. కెమెరా వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా రివెంజ్ తీర్చుకునే నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ బాగుంది. డైలాగ్స్ కూడా కథకు తగ్గట్టుగా బాగున్నాయి.

దర్శకుడు ముప్పలనేని శివ విషయానికి వస్తే, ఫస్టాఫ్ వరకూ మంచి స్క్రీన్‌ప్లే రాసుకున్న ఆయన, సెకండాఫ్ విషయంలో మాత్రం రచయితగా పూర్తి స్థాయిలో రాణించలేకపోయారు. ఇక దర్శకుడిగానూ ఈ సినిమాలో ఆయన తన స్థాయికి తగ్గ ప్రతిభ చూపలేదు. అక్కడక్కడా ఫర్వాలేదనిపించినా, ఓవరాల్‌గా ఓ సినిమాను మనకు బోర్ కొట్టకుండా అందించే ప్రయత్నంలో మాత్రం పూర్తి స్థాయిలో అలరించలేకపోయారు.

తీర్పు :

సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న కృష్ణ రీ ఎంట్రీ సినిమాగా ప్రచారం తెచ్చుకున్న ‘శ్రీ శ్రీ’, ఆయన అభిమానులను అలరించేలానే ఉందని చెప్పొచ్చు. ఒక మంచి పాత్రలో, తన స్థాయికి తగ్గ నటనతో కృష్ణ బాగా మెప్పించడం, ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలన్నీ ఆకట్టుకునేలానే ఉండడం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు. ఇకపోతే పాతకథను, అదే పాత ఫార్మాట్‌లో చెప్పడం, సెకండాఫ్ ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడం లాంటివి ఈ సినిమాకు మైనస్. ఒక్కమాటలో చెప్పాలంటే.. సూపర్ స్టార్ కృష్ణ వెండితెరపై కనిపిస్తే చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది.

ADD



మరింత సమాచారం కోసం
LIKE, FOLLOW & SUBSCRIBE us

Facebook          Twitter          YouTube          Blog          Google+

No comments :

Post a Comment

 
Copyright © 2013 26PICTURES తెలుగు
Design by FBTemplates | BTT
    Twitter Facebook Google Plus Vimeo YouTube